ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక
ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక
ప్రజా సంక్షేమానికి పెద్దపీటవేసే ప్రభుత్వం ఇది
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి ప్రభుత్వం 15 వేలు జమ చేయనుండటం పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నారని కొనియాడారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని అన్నారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆదాయం తగ్గిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలవుతోందని పేర్కొన్నారు. అలాగే వాహన యజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించిందని, రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.
