గుడివాడలో తొలి ఐటి కంపెనీ ప్రారంభం
గుడివాడలో తొలి ఐటి కంపెనీ ప్రారంభం


గుడివాడ :గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమయ్యింది.100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభం అయ్యాయి.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ద్వారా అందించనున్న సేవల వివరాలను సీఈఓ కారం శెట్టి రవి ఎమ్మెల్యే రాముకు వివరించారు.
ఐటీ కంపెనీ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాము ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రారంభమైన ఐటీ కంపెనీ విజయవంతంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందన్నారు.ప్రిన్స్ స్టన్ సంస్థను నా సొంత కంపెనీగా భావించి విజయవంతనికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఐటీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న మిత్రుడు రవి సొంత ఊరుపై మమకారంతో గుడివాడ పట్టణంలో ఐటీ కంపెనీ ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. గుడివాడలో ఐటీ రంగంలో తొలి అడుగు పడడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇదే స్పూర్తితో మరిన్ని ఐటి కంపెనీలు గుడివాడలో ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. చిన్న స్థాయి పట్టణాలకు ఇలాంటి ఐటీ కంపెనీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వర్క్ హోం అంటే సొంత ఊరులో పని చేసుకోవడమేనని ఆయన చెప్పారు. ఈ మంచి ప్రయత్నం విజయవంతం కావాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. పి.4 స్ఫూర్తితో మరింత మంది ప్రవాసులు గుడివాడలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్ సీఈవో కారం శెట్టి రవి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అమెరికాలోని న్యూ జెర్సీలో, కెనడా,డొమినికా దేశాల్లో సేవలు అందిస్తున్నామన్నారు. మనదేశంలో హైదరాబాద్, కాకినాడలో ఐటీ సంస్థలు నెలకొల్పామని, పుట్టిన ఊరు మీద ప్రేమతో నేడు గుడివాడలో వందమంది పనిచేసేలా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. గుడివాడలో సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పగానే ఎమ్మెల్యే రాము ఎంతో ఆనందించి, తనకు సంపూర్ణ సహకారం అందించారన్నారు. ఎమ్మెల్యే రాము ఇచ్చిన మద్దతుతో గుడివాడలో విజయవంతంగా సంస్థను ఏర్పాటు చేయగలిగానని రవి పేర్కొన్నారు. నేడు ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా గుడివాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన టాలెంటెడ్ గల యువతకు అవకాశాలు ఇస్తానని ఆయన చెప్పారు.
జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ బూతులు మయంగా మారిన గుడివాడకు రాము లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ఏన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఇప్పటికే చూశామన్నారు. ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో గుడివాడలో మరిన్ని ఐటి కంపెనీలు వస్తాయని శ్రీకాంత్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, నిమ్మగడ్డ సత్యసాయి, పేద్దు శ్రీకాంత్,పట్టణ ప్రముఖులు మాటూరి రంగనాథ్ ఈ కార్యక్రమంలో ఐటి సర్వీసెస్ ప్రతినిధులు, ఉద్యోగులు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
