జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి KCR..ఫుల్ జోష్‌లో గులాబీ శ్రేణులు
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి KCR..ఫుల్ జోష్‌లో గులాబీ శ్రేణులు
తెలంగాణ :
హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా..నామినేషన్ల పర్వానికి నేటితో ఎండ్ కార్డ్ పడింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ నేతలు గడగడపకు వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 40 మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ లిస్ట్ విడుదల చేశారు.
అయితే, అందరూ ఊహించినట్లుగానే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలిపేరు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. అదేవిధంగా కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో పాటు మరో 36 మంది పేర్లు ఉన్నాయి. చాలా నెలల తరువాత ప్రజా క్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
