టెక్స్ టైల్స్ లో 9 ఎంవోయూలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

0

టెక్స్ టైల్స్ లో 9 ఎంవోయూలు

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత


అమరావతి: రాష్ట్రంలోని టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తొమ్మిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. వారిలో అయిదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు నేడు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మేటరెస్ మాన్యూఫ్యాక్చరింగ్, అపెరిల్ ప్రొడక్షన్, గార్మెంట్స్ తయారీ, పోలిస్టర్ వేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని, టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోడానికి ఆయా కంపెనీ ప్రతినిధులు సంసిద్ధం వ్యక్తంచేశారన్నారు. తమ కంపెనీలను రాయలసీమలో ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చారన్నారు. ఏయే ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబోయేది పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఖరారు కానుందని మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ పాలసీతో ఏపీలో పెట్టుబడులకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. రాబోయే కాలంలో మరికొందరు పెట్టుబడుదారులు ఏపీలో తమ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముందన్నారు. సమావేశానికి హాజరైన నలుగురు పెట్టుబడుదారులను మంత్రి సవిత సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోసిడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *