పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియదు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియదని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం కాగానే ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని తెలిపారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన డిమాండ్ చేశారు.
పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు. లేకుంటే సినిమాలు ఆడవని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి సూపర్ మ్యాన్ అని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని గుర్తు చేశారు. అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి హితవు పలికారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాము ఎంతో నష్టపోయామని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వల్ల నష్టపోయామని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఏం జరిగిందంటే
కోనసీమ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నాయకుల దిష్టి వల్ల ఈ ప్రాంతంలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోని రాజకీయ నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
