పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు : వివరాలు వెల్లడించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని
నెల్లూరు జిల్లా: నెల్లూరు కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సిపిఎం కార్యకర్త కె.పెంచలయ్య (38) ఆర్డిటీ కాలనీలో నివాసం ఉంటూ సామాజిక స్పృహతో వ్యవహరించే ఆయన ఆర్డీటీ కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
అరవ కామాక్షమ్మ తన అనుచరులతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేదని ఈ క్రమంలోనే పెంచలయ్యపై కోపం పెంచుకున్న ఆమె తన అనుచరులు కత్తులతో అతడిని పొడిచి హతమార్చారన్నారు. ఈ ఘటన అనంతరం ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 25 కిలోల గంజాయితోపాటు కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ కేసుకు సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. కామాక్షమ్మను గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆమె సోదరుడు జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
