బండిఆత్మకూరు మరియు వెలుగోడు పోలీస్ స్టేషన్ లు ఆకస్మిక తనిఖీ : ఎస్పీ సునీల్ షొరాణ్
నంద్యాల: బండిఆత్మకూరు మరియు వెలుగోడు పోలీస్ స్టేషన్ లు ఆకస్మిక తనిఖీ : ఎస్పీ సునీల్ షొరాణ్



నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని బండిఆత్మకూరు పోలీస్ స్టేషన్ మరియు ఆత్మకూరు సబ్ డివిజన్ లోని వెలుగోడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు ,లాకప్ గదులు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కోర్టు క్యాలెండర్,స్టేషన్ రికార్డులు జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, పెండింగ్ కేసుల వివరాలు మొదలగు రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలు మరియు గ్రామాలలో పరిస్థితుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నాడు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు మరియు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశిస్తూ సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు గ్రామాలలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజల తో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు. నేను నియంత్రణలో C.C కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి,క్షుణ్ణంగా విచారించి నిర్దిష్ట సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. పాత నేరస్థులు, నేర చరిత్రగల వారు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి విధులు అడిగి తెలుసుకుని వృత్తి పరమైన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
