మిర్చి పంటలో తెగుళ్లపై అత్యవసర చర్యలు ప్రారంభించండి: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి/విజయవాడ: మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్గా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా. కే. శ్రీనివాసులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, పురుగు ప్రభావం ఉన్న ప్రాంతాలకు శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపాలని మంత్రి స్పష్టం చేశారు. మందుల పిచికారీపై శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సలహాలను రైతులకు అందించేందుకు ప్రత్యేక బృందాలు పని చేయాలని సూచించారు. 2021 నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి జరుగుతుండటంతో, ఈ సమస్య పై గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శనలు చేపట్టి రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రత్యేక కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని హార్టికల్చర్ డైరెక్టర్ మంత్రి అచ్చెన్నాయుడికి వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.
నివారణ మార్గాలు
ఈ పురుగు నివారణకు డా వై.యస్.ఆర్ విశ్వ విద్యాలయం వారు సూచించిన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. 1. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. 2. ఎకరాకి 200 కేజీల వేప చెక్కను చివరి దుక్కులో వేసుకోవాలి. 3. సిఫారుసు చేసిన మోతదులోనే ఎరువులు వేసుకోవాలి. 4. పంట మార్పిడి చేయాలి. 5. పచ్చిరోట్ట పైరును వేసుకోవాలి. 6. రైతులు సామూహికంగా ఎకరానికి 40 నుంచి 50 నీలి రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. 7. వేప సంబందిత పురుగు మందులైన వేప నూనే (10,000 పి.పి.యం.- 1 మి.లీ లీటరు నీటికి లేదా 1500 పి.పి.యం లేదా 3000 పి.పి.యం 2 మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 8. సిఫారుసు చేసిన పురుగు మందులైన బ్రోప్లనిలైడ్ 20 ఎస్.సి. 34 మి.లీ., లేదా ప్లుక్సామెటామైడ్ 20 ఈ.సి. 160 మి.లీ., లేదా ఫిప్రానిల్ 80% డబ్య్లు .జి. 40 గ్రా., లేదా స్పైరో టెట్రామాట 15.30% ఓ.డి. 200 మి.లీ. చొప్పున 1 ఎకరానికి పిచికారి చేయాలి. వాడిన పురుగు మందునే మరల వాడకుండా మార్చి మార్చి పిచికారి చేయాలి. విచక్షణా రహితంగా తక్కువ వ్యవధిలో సిఫారుసు చేయని పురుగు మందులను వాడరాదని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
