వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రియుడు అరెస్ట్

0
IMG-20251225-WA0826

తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్ కాలనీలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, అదే సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

అచ్చంపేట మారుతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్ (38), పద్మ (30) దంపతులు. గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఈ ఘటనపై అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సంబంధానికి లక్ష్మణ్ నాయక్ అడ్డుగా మారడంతో, అతన్ని హతమార్చాలని పద్మ, గోపి కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. గత నెల 24న రాత్రి నిద్రలో ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిని గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం మరుసటి రోజు ఉదయం ఏమి తెలియనట్లు పద్మ పాఠశాలకు వెళ్లింది. అనంతరం ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఫోన్ ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని ఆందోళన నటించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటికి వచ్చాక భర్త మృతిచెందినట్లు నమ్మించడంతో, మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణ జరిపిన పోలీసులు, అక్రమ సంబంధమే హత్యకు కారణమని ఆధారాలతో రుజువు చేశారు. ఈ మేరకు పద్మ, రాత్లావత్ గోపిలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *