విశాఖలో కీలక ఈవెంట్లు 14, 15 తేదీల్లో సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్

0

విశాఖలో కీలక ఈవెంట్లు

14, 15 తేదీల్లో సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్

ఫిబ్రవరిలో నేవీ ఫ్లీట్ రివ్యూ మిలాన్ విన్యాసాలు

విశాఖపట్నం: అంతర్జాతీయంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం పలు కీలక అంశాలకు వేదికగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న పలు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకు సంబంధించి డేగ కళ్లతో నిఘా వర్గాలు నగరంపై కన్నేసాయి. అలాగే పటిష్టమైన భధ్రత వ్యవస్థను నెలకొల్పుతున్నారు. అదే సమయంలో వచ్చే అతిథులు మంత్ర ముగ్ధులయ్యేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సిటీ బ్యూటీఫికేషన్ తో పాటుగా సరికొత్తగా నగరంలోని ప్రముఖ కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నాయి.

సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్:

ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సీఐఐ (కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) ఆధ్వర్యంలో పెట్టుబడుదారుల సదస్సు జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ సదస్సు దేశంలోని ప్రముఖ వ్యాపార వేత్తలతో పాటుగా అంతర్జాతీయ స్థాయి వ్యాపార దిగ్గాజాలు, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా సమ్మట్ నిర్వహిస్తుండటంతో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు, నగర సుందరీకరణ పనలు చేపడుతున్నారు.

సాగరం తీరంలో ఐఎఫ్ ఆర్:

భారత నావికాదళానికి అత్యంత కీలకమైన విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం దేశ రక్షణకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేడుకలను ఇక్కడ నిర్వహించబోతోంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 మధ్య ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్య్వూ (ఐఎఫ్ ఆర్) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టింది. పలు ప్రపంచ దేశాలకు చెందిన నావికాదళాలు ఈ వేడుకలకు హాజరై తమ నౌకాదళ అస్త్రాలు, ఆయుధ సంపత్తి శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించబోతున్నాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరుకానున్నారు. అలాగే మన నౌకాదళానికి చెందిన ఐఎన్ ఎస్ విక్రాంత్ జలాంతర్గామి నుంచి ఆయుథ సంపత్తిని రాష్ట్రపతి పరిశీలిస్తారు.

మిలాన్:

మిలాన్ పేరిట నౌకాదళానికి చెందిన మరో కీలక వేడుకకు కూడా విశాఖ ఆతిధ్యం ఇవ్వబోతోంది. పలు దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్టు గార్డులు మిలాన్ వేడుకలకు హాజరుకానున్నాయి. సాగర తీరంలో తమ విన్యాసాలను ఈ మిలాన్ లో భాగంగా ప్రదర్శించబోతున్నాయి. సిటీ పరేడ్ అత్యంత ఆకర్షణగా నిలబోతోంది. అలాగే భారత నావికాదళం ఆధ్వర్యంలో పలు దేశాలకు నేవీ అధిపతులు సదస్సు కూడా జరగనుంది. పలు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, పరస్పరం సమాచారం అందిపుచ్చుకోవడం, పకడ్బందీ భద్రతపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఇలా అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సులకు విశాఖ వేదిక కావడంతో నగర కీర్తి ప్రతిష్టప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *