అంత డబ్బు మాకొద్దు అందుకే ఇచ్చేస్తున్నాం!
అంత డబ్బు మాకొద్దు…అందుకే ఇచ్చేస్తున్నాం!
మాది కర్ణాటక. బెంగళూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయ్యాక ఎండీ చదివేందుకు యూఎస్ వెళ్లాను. మావారు కృష్ణ చివుకుల అక్కడే పరిచయం. ఆయనది ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల, ఐఐటీ మద్రాస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఎంటెక్ పూర్తిచేసి అక్కడికొచ్చారు. అనుకోకుండా కలవడం, స్నేహితులమవడం, ఒకరినొకరు అర్థంచేసుకుని పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఇన్నేళ్ల మా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే మేం కలవడం అదృష్టంగా భావిస్తుంటాం. అమెరికాలో ఉన్నా, ఎప్పుడూ భారత్ గురించే మా ఆలోచన. అందుకే మా ‘ఇండో మిమ్’ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కర్ణాటకలోనే పెట్టాం. దీని ద్వారా మెటల్ ఇంజక్షన్ మోల్డింగ్ (మిమ్) సాంకేతికతను తొలిసారిగా భారత్ కి పరిచయం చేశాం.
అత్తగారికిచ్చిన మాట కోసం:
అది 1994 హైదరాబాద్ వచ్చాం. మా అత్తగారు లలితాశ్రీ న్యాయవాది. సామాజిక స్పృహ ఉన్న మహిళ. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి పేద పిల్లలకు చదువు చెప్పించేవారు. ఆమె చలవతో చాలామంది డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. ఓ రోజు ఆవిడ మా ఇద్దరినీ పిలిచి.. ‘ఈ సేవ ఎంతో సంతృప్తినిస్తోంది. వారి జీవితాల్లో వెలుగులు చూస్తుంటెర చాలా మీరూ సేవ చేయండి, నలుగురికి సాయపడండి’ అన్నారు.
యూఎస్ వెళ్లాక మా ఇద్దరిలోనూ అవే ఆలోచనలు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.. ఇక మన అడుగులు పేదల వైపు అని. మా వారు చైర్మన్, నేను డైరెక్టర్‌గా ఉన్న ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మిమ్ సామర్థ్యం ఉన్న సంస్థ. భారత్’లో కంపెనీ పెట్టిన నాలుగైదేళ్లకు ప్రభుత్వం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదలు పెట్టాం. ఆయా పాఠశాలల్లో ఇప్పటికీ రోజుకు 2500 మందికి ఆహారం అందిస్తున్నాం. దీంతో పిల్లల హాజరు గణనీయంగా పెరుగుతోంది. తమ పిల్లలు విద్యావంతులవుతున్నారని అక్కడి తల్లిదండ్రుల్లో కనిపించే సంబరం మాకెంతో ఆనందాన్నిచ్చింది. చామరాజనగర్ జిల్లాలో ఓ పాఠశాలను దత్తత తీసుకున్నాం. ఇక్కడ అనాథ, నిరుపేద పిల్లలు చదువుతున్నారు.
స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశస్థులు సైతం ఇక్కడికొచ్చి పాఠాల్ని బోధించే తీరును అధ్యయనం చేశారు. పిల్లలు ప్రయోజకులై ఉద్యోగాలూ సాధిస్తున్నారు. ఇది మాకెంతో గర్వకారణం. అమెరికాలోని పేదలకు వైద్యమందేలా అక్కడి టంపా జనరల్ ఆసుపత్రికి 65 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చాం. ఇప్పుడు ఐఐటీ మద్రాసుకు రూ.228 కోట్లు ఇచ్చాం. ఇది సీఎస్ఆర్ లో భాగం కాదు, కంపెనీ షేర్ల నుంచి తీసి ఇచ్చిందే.
భారతీయుల్లో ఆత్మవిశ్వాసం తక్కువని గతంలో అనేవాళ్లు. మన ఆత్మవిశ్వాసం ఏ పాటిదో చూపించేందుకు కఠోర దీక్షతో కంపెనీల్ని వృద్ధి చేశాం. ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిచాం. ఇప్పుడు అమెరికా వాళ్లే చెబుతున్నారు.. ‘భారతీయులు మామూలు వాళ్లు కాదు, ఆత్మవిశ్వాసం ఎక్కువ’ అని. ప్రస్తుతం మా కంపెనీల్ని విస్తరించుకుంటున్నాం. మా ఉత్పత్తులు 45 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏడాదికి రూ.1000 కోట్ల టర్నోవర్. మాకు ఇంత డబ్బు అక్కర్లేదు. సౌకర్యంగా బతకడానికి సరిపడాఉంటే చాలు. మిగిలిందంతా పేదల సంక్షేమంకోసం ఖర్చుచేయాలనే అనుకుంటున్నాం. అవసరమున్న చోటల్లా ఆదుకుంటూ వెళ్లాలన్న తపనే మాలో ఉంది. ఈ ప్రయాణం ఎంతదూరం వెళ్తుందో తెలియదు. ఊపిరి ఉన్నంత వరకూ కొనసాగిస్తూనే ఉంటాం.
బి. హిదాయతుల్లాహ్, చెన్నై
