ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం : మంత్రి నారాయణ
ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం : మంత్రి నారాయణ
నెల్లూరు : ఆటో డ్రైవర్ల కష్టాన్ని సీఎం చంద్రబాబు దగ్గరగా చూశారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. వారి కష్టాలను తీర్చేందుకే ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నామంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి అండగా నిలిచేందుకు ఏడాదికి 15000 ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుందని వివరించారు. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసి సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారని మంత్రి నారాయణ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల కోసం కూడా నూతన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే ఆటో యజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించిందని, రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు
