ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటాం: మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా /ఆత్మకూరు: ఇటీవల ఆత్మకూరులో నెల్లూరు పాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడబిడ్డలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బోయిల్లచిరువెళ్ళ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చావల మాధవ మరియు వారి సతీమణి మనోజల చిత్రపటానికి మంత్రి ఆనం నివాళులర్పించారు.
వారి కుమార్తెలు మనస్విని, లక్ష్మీ తేజస్వినిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వారిని ఓదార్చి తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేనిదని, ఈ దుర్ఘటన అందరినీ కలచివేసిందని మంత్రి తన బాధను వ్యక్తం చేశారు.
ఆడబిడ్డల భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని, ఈ ప్రాంత ప్రతినిధిగా వారి బాధ్యతను తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. మనస్విని (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) మరియు లక్ష్మీ తేజస్విని (9వ తరగతి)విద్యాభ్యాసానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
వారికి ఉన్న మూడు ఎకరాల భూములను కూడా రెవిన్యూ సమస్యలను తొలగించి ఇద్దరికీ చెరిసగం భూములకు పట్టాలు తయారు చేయించి ఇవ్వాలని తాసిల్దార్ ను ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా నూతన ఇంటిని మంజూరు చేయించి అధికారుల ద్వారానే ఆ ఇంటిని పూర్తి చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
చనిపోయిన వారిద్దరూ తమ పార్టీ క్రియాశీలక సభ్యులైనందున పార్టీ తరఫున ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా నారా లోకేష్ బాబు తో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇద్దరు ఆడపిల్లలకు మరింత ఆర్థిక సహాయం చేస్తామని మంత్రి ప్రకటించారు.
తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను ఆ ఇంటి పెద్దదిక్కులా స్వయంగా మంత్రి వచ్చి పరామర్శించి, ఆ ఆడబిడ్డల భవిష్యత్తుకు ధైర్యం చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది.
ప్రమాదం జరిగిన రోజు ఆత్మకూరులోనే ఉన్న మంత్రి నేరుగా ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి వెళ్లి సంఘటనను తెలుసుకొని పరామర్శించారు. అంతటితో మరచిపోకుండా మానవతావాదిగా నేడు స్వయంగా వారి ఇంటికి వచ్చి ఆ బిడ్డలకు తాను,తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆ బిడ్డలకు ఏం కష్టం వచ్చినా తాను ఉంటాననే నమ్మకాన్ని భరోసాను కల్పించారు.
