ఆమని చిరువెళ్ల గ్రామానికి మంత్రి ఆనం వరాలు.. రహదారితోపాటు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి హామీ

0

గ్రామంలో రామాలయం నిర్మాణానికి 30 లక్షలు నిధులు మంజూరు

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

నెల్లూరు జిల్లా/అనంతసాగరం: అనంతసాగరం మండలం ఆమని చిరువెల్ల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గ్రామస్తులు తెలిపిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం సాయంత్రం గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా మేకల వారి పాలెం నుంచి ఆమని చిరువెళ్ల

గ్రామానికి రాకపోకలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, సుమారు ఒకటిన్నర కిలోమీటర్ మేర రోడ్డు నిర్మించి, వాగుపై బ్రిడ్జి నిర్మించాలని మంత్రిని కోరారు. ఇందుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో రామాలయం నిర్మాణానికి 30 లక్షలకు పైగా నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రికి గ్రామస్తులు జేజేలు పలికి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం

తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేసిన నూతన పాస్ పుస్తకాలను మంత్రి రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ప్రభుత్వ రాజముద్రతో, క్యూ ఆర్ కోడ్‌తో జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పూర్తిగా చట్టబద్ధత కలిగినవని తెలిపారు. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు తక్షణమే కనిపిస్తాయని వివరించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలకు, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు మధ్య ఉన్న తేడాను రైతులకు సులభంగా అర్థమయ్యేలా మంత్రి వివరించారు.

గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానం, విలువ లేనివని, తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పుస్తకాలు మాత్రం రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీ నోట్ల మాదిరిగా పూర్తి విలువ, భద్రత, చట్టబద్ధత కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో 235 గ్రామాల్లో రీ సర్వే చేపట్టి గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాల స్థానంలో నూతన పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వడమే లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు.
2026 డిసెంబర్ నాటికి రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు, ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి ఆనం తెలిపారు.

ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పావని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *