ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే: ఏపీఎస్ ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్దేశం
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలని వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్ మ్యాప్‌పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు.
పర్యావరణహితంగా ప్రజా రవాణా
రాష్ట్రంలో పర్యావరణహితమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈవీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 2030 నాటికి దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను మాత్రమే నిర్వహించాలన్నారు. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. అలాగే ఈ బస్సుల మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలన్నారు. స్వయం సమృద్ధి సాధించేలా రైల్వే శాఖ తరహాలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో రవాణాపై మరింత దృష్టి పెట్టాలన్నారు. అన్ని బస్ స్టేషన్లకు వాణిజ్యపరంగా మరింత ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలన్నారు. మరోవైపు పీఎం – ఈ బస్ సేవా పథకం కింద 750 ఈ-బస్సులు రాష్ట్రానికి అందిస్తోందని, అలాగే తిరుమల–తిరుపతికి మరో 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. థింక్ గ్యాస్ సంస్థ భాగస్వామ్యంతో చిత్తూరు–వెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు చెప్పారు.
