ఉత్తరాంధ్ర అభివృద్ధికి స్వర్ణయుగం.. రాజకీయాలకు అతీతంగా అంతా కదిలి రావాలి
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్వర్ణయుగం మొదలైందని, రాబోయే తరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో జరిగిన ‘జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ’ ఎంవోయూ (MOU) సంతకాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను చూస్తున్నానని, ప్రతీ నాయకుడు వేదికెక్కి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడటమే తప్ప, గట్టిగా పని చేసింది లేదని గుర్తు చేశారు. కానీ నేడు చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నారా లోకేష్ చొరవ, కేంద్రంలోని మోదీ సహకారంతో ఉత్తరాంధ్ర దశ తిరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనివ్వరు, ఇప్పుడు లోకేష్ కూడా అదే బాటలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు.
సొంత గడ్డపై ఎయిర్ పోర్ట్ అది మన అదృష్టం:
ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎయిర్ పోర్ట్ కట్టడం వేరు, కానీ తన సొంత ప్రాంతమైన ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే అవకాశం రావడం తన అదృష్టమని జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు చెప్పడం, వారి జన్మభూమి ప్రేమకు నిదర్శనమని స్పీకర్ పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ రాకతో ఈ ప్రాంత ముఖచిత్రం మారిపోతుందన్నారు.
పూసపాటి వారి త్యాగం వెలకట్టలేనిది:
విద్యావ్యాప్తి కోసం కోటలనే త్యాగం చేసిన ఘనత పూసపాటి రాజవంశానిదని స్పీకర్ కొనియాడారు. కేవలం పది వేలు విరాళం ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకునే రోజులివి అని, కానీ వేల కోట్ల విలువైన ఆస్తులను, కోటలను విద్య కోసం రాసిచ్చిన అశోక్ గజపతిరాజు చాలా నిరాడంబరంగా ఉంటారని, చిన్న కారులో తిరుగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అశోక్ గజపతిరాజు ప్రచారాన్ని కోరుకోకపోయినా, వారి త్యాగాలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
విమానయాన రంగంలో టెక్నీషియన్ల కొరత ఉందని, విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఈ ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మన యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని స్పీకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్య & మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ & మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు



తదితరులు పాల్గొన్నారు.
