ఎరువుల బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లోనే…వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

0

తెలంగాణ: రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణీత సమయానికి ఎరువులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ ఇకపై రాష్ట్రమంతటా అమలు కానుంది.

గత ఖరీఫ్‌ సీజన్‌లో ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ మొబైల్‌ యాప్‌ను యాసంగి సీజన్‌లో రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు. గతంలో డీలర్‌ కేంద్రాల్లో ఆధార్‌ ధృవీకరణ ఆధారంగా ఎరువుల పంపిణీ జరిగేది. దుకాణాల వద్ద భారీ క్యూ లైన్లు, బ్లాక్‌ మార్కెట్‌, అధిక ధరలతో రైతులు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యలకు పరిష్కారంగానే ప్రభుత్వం మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మొబైల్‌ యాప్‌లో సమీపంలోని డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిల్వలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా రైతులు ఎరువులు బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ నిర్ధారణ అయిన తర్వాత డీలర్‌ వద్దకు వెళ్లి యూరియాను తెచ్చుకోవచ్చు. ఈ విధానం వల్ల ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు పడే సమస్య తప్పడంతో ఈ విధానంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తుమ్మల తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి 18) నాటికి 14.29 లక్షల మంది రైతులు ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా 56.86 లక్షల బస్తాల యూరియా బుక్‌ చేసుకోగా 51.47 లక్షల బస్తాల పంపిణీ పూర్తయినట్లు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *