చరిత్ర సృష్టించిన టీమిండియా ప్రపంచంలోనే తొలి జట్టుగా

0

చరిత్ర సృష్టించిన టీమిండియా ప్రపంచంలోనే తొలి జట్టుగా

తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడేందుకు భారత మహిళల జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది.

గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) కూడా వీరోచిత పోరాటం కనబరిచింది.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 156 బంతుల్లో 167 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. హర్మన్ ప్రీత్ ఔట్ అయినా.. జెమీమా మాత్రం పట్టువదల్లేదు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత జట్టును మూడో సారి ఫైనల్‌కు చేర్చింది.

చరిత్ర సృష్టించిన భారత్‌:

ఇక ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఓ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్ చేసిన జట్టుగా భారత్ రికార్డులెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.

ఇదే టోర్నమెంట్‌లో వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కానీ తాజా మ్యాచ్‌లో భారత్‌ 339 పరుగుల టార్గెట్‌ను చేధించి ఆసీస్‌ను అధిగమించింది. భారత్‌, ఆస్ట్రేలియా తర్వాతి స్ధానంలో శ్రీలంక(302) ఉంది. ఇక నవంబర్ 2న ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *