తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ – టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ
టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం
పాల్గొన్న బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయంరూ.10 నుండి 20 లక్షలకు పెంపు
టీటీడీలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు – టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన
సమావేశంలో బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా ఈవో జె.శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు. తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదించారు. పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని, సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు.
