తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీఎం చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీఎం చంద్రబాబు
హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ హయాంలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ లో జరిగిన శిక్షణా శిబిరాల విషయాలను ఈ సందర్భంగా నేతలతో పంచుకున్నారు. కోటి మంది పార్టీ క్రియాశీలక సభ్యులతో దేశంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రజల వద్దకు మరింతగా తీసుకువెళ్లేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుందని తెలిపారు. కార్యకర్తే అధినేత అనే సిద్దాంతంతో పనిచేసే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం నాకు ప్రత్యేకమేనని అన్నారు. నేటి ఈ సమావేశం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని తెలిపారు.
