నేడు తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం జరగనున్న రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరగనున్న “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ లో పాల్గొననున్నారు. గత నెల 24వ తేదీ నుంచి 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా “రైతన్నా… మీ కోసం” పేరుతో రైతుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా చేసిన ప్రచారంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ప్రచారం చేశారు. అలాగే సీఎం చంద్రబాబు రాసిన లేఖను ప్రతి రైతు ఇంటికి వెళ్లి ఈ ప్రచారంలో క్షేత్ర స్థాయి అధికారులు మొదలుకుని ఉన్నతాధికారులు, అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ నిర్వహించనున్నారు. నల్లజర్లలో జరగనున్న వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి నల్లజర్లకు బయలుదేరతారు. 10.55 గంటలకు నల్లజర్లకు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వర్క్ షాప్ ప్రాగంణంలో ఏర్పాటు చేసిన “రైతన్నా… మీ కోసం”స్టాళ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 11.50 గంటలకు ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి అయ్యి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 01.45 గంటల నుంచి 03.15 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
