నోటి దూల మాజీ మంత్రిగానే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు
జోగి రమేష్ వ్యాఖ్యలపై సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటు విమర్శ
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పని చేశారు? అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటి దూల మంత్రి ఎవరు? అని అంటే టక్కుని చెప్పగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమం బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటి దూలే కారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డూ అదుపూ లేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అసత్య ఆరోపణలు చేయటాని పూర్తిగా తప్పు పట్టారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కి విజయవాడ అభివృద్ధి ధ్యాస తప్ప, మరొక ఆలోచన చేసే తీరిక కూడా లేదన్నారు. తప్పు చేసిన వ్యక్తులు, నేరం చేసిన నేరగాళ్ళు గుళ్ళకు వెళ్ళి ప్రమాణాలు చేస్తాం అంటే, చట్టాలు ఎందుకు? న్యాయస్థానాలు ఎందుకు? అని ప్రశ్నించారు. జోగి రమేష్ సొంత తప్పిదాలు, నిర్వాకం కారణంగానే జగన్ పరామర్శ యాత్రలో రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని ఆరోపించారు. కోటి మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీని, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన పార్టీ అధినేతలను దూషిస్తే, పార్టీ పై ఏక వాక్య ప్రయోగాలు చేస్తే, కార్యకర్తలు మౌనంగా ఎలా? ఉంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులపై, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ముంటే, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చుని బాలకోటయ్య హితవు చెప్పారు. విలేకరుల సమావేశంలో దళిత నాయకులు పేరం భుజంగరావు, మామిడి సత్యం తదితరులు పాల్గొన్నారు.
