పెండింగ్ స్టేట్ షేర్ నిధుల విడుదలతో పట్టు పరిశ్రమకు ఊపిరి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: కూటమి ప్రభుత్వం పట్టు రైతుల పక్షాన అండగా నిలిచి, గత ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ సహాయం అందక నిర్లక్ష్యం పాలైన పట్టు రైతులకు పెండింగ్ నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సిల్క్ సమగ్ర–2 పథకం కింద 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన వివిధ పథకం ల కోసం పట్టు పరిశ్రమల శాఖకు రాష్ట్ర వాటా (మ్యాచింగ్ స్టేట్ షేర్ ) గా రూ.14 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తంలో నుంచి రూ.13 కోట్ల 75 లక్షల రూపాయలకు సంబంధించిన బిల్లులు గుంటూరు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సమర్పించగా, లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. 2021–22 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న స్టేట్ షేర్ నిధులను క్లియర్ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,663 మంది సిల్క్ రైతులు లబ్ధి పొందారని, మల్బరీ తోటల అభివృద్ధి, పట్టు పురుగుల పెంపక షెడ్లు, కిసాన్ నర్సరీలు, డిస్ఇన్‌ఫెక్టెంట్లు, రీరింగ్ పరికరాల సరఫరా, ట్విస్టింగ్ యూనిట్లు, బేసిన్ మౌంటెడ్ రీలింగ్ యూనిట్లు, IARM కార్యక్రమాలు, ప్రైవేట్ గ్రైనేజ్‌ల ఏర్పాటు వంటి అనేక భాగాల కింద వ్యయం చేసినట్లు తెలిపారు. సకాలంలో నిధుల విడుదలతో పట్టు పరిశ్రమ రంగానికి కొత్త ఉత్సాహం లభించిందని, సిల్క్ రైతుల ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పట్టు రైతులకు, పట్టు రీలర్లకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
