బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. ఘనంగా సత్కరించిన ప్రధాని మోదీ..!!

0

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం జరిగిన నామినేషన్ల తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధిష్ఠానం ప్రకటించింది.

ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని నితిన్ నబీన్‌ను సత్కరించారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది.

అగ్రనేతల సమక్షంలో నబీన్ బాధ్యతల స్వీకారం

ఈ వేడుకలో ప్రధాని మోడీతో పాటు పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర అగ్రనేతలు పాల్గొని నూతన అధ్యక్షుడిని అభినందించారు. జాతీయ ఎన్నికల అధికారి కె. లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎన్నిక ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్ర యూనిట్లలో 30 మంది రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది.

ఏకగ్రీవంగా ఎన్నిక

నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలే ఆయన పేరును ప్రతిపాదించడం విశేషం. జనవరి 19న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య జరిగిన నామినేషన్ల ప్రక్రియలో నితిన్ నబీన్ తప్ప మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీలో ‘సంగఠన్ పర్వ్’ పేరుతో జరిగిన ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ద్వారా నూతన సారధిని ఎంచుకున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *