బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకు.. రూ.90.50 కోట్లు మంజూరు: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రెండో విడతగా రూ.69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గానూ రెండో విడతగా రూ. 21.10 కోట్లను విడుదల చేసిందన్నారు. పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నామన్నారు. రెండు ఉత్తర్వుల ద్వారా రూ. 90.50 కోట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు.
బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ లు మంజూరు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు అన్ని వర్గాలతో పాటు బీసీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. బీసీ గురుకులాల్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.
