భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం: తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి నాగరికత పరిచయం చేసిన దేశం మనది
సంస్కృతి-విజ్ఞానాలతో పరిఢవిల్లిన చరిత్ర మన సొంతం
సున్నాను ఆవిష్కరించాం…భవిష్యత్తులో మరెన్నో ఆవిష్కరణలు చేయాలి
దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ… దేశాభివృద్ధికి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేస్తున్న కృషి శ్లాఘనీయం
తిరుపతి: భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 


”సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత ద్వారా చాటి చెప్పాం. 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం. ఇప్పుడు 150 దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా పాటిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించాం. 2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది. పూర్వ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మన భారత దేశం. 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది జీరోను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారత దేశం సొంతం. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు. వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు.”అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
“మన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోంది. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయి. 2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేది. కానీ విదేశీ పాలన, స్వాతంత్ర్యం వచ్చాక మనం చేసుకున్న కొన్ని పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడింది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నాం. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుంది. ప్రతి జంట ముగ్గురు పిల్లలు కనాలని మోహన్ భగవత్ చెబుతున్నారు.నేనూ అదే చెబుతున్నా. ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారు. కొన్ని దేశాలు వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. మనకు ఆ ఇబ్బంది లేదు. తిరుగులేని యువశక్తితో కూడిన దేశం మనది. ఈ సంపదే మన దేశాన్ని అగ్ర భాగంలో నిలుపుతుంది. భారతదేశం నెంబర్-1 స్థానంలోకి వెళ్లనున్న సందర్భంలోనే పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. గంగా-కావేరీ నదుల అనుసంధానం అనేది జరగాలి. అప్పుడు నీటి భద్రత కలుగుతుంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. వినూత్న ఆలోచనలు చేయాలి. కొత్త ఆవిష్కరణలు చేపట్టాలి. భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోంది. ఇదే సమయంలో దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రత్యేకంగా నిలబట్టేంది మన విలువలు, సంప్రదాయాలే. ఆ దిశగా మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. విలువలు, నైతికత వంటి అంశాలను పెంపొందించేందుకు మోహన్ భగవత్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. భారతదేశంలో అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. మన పురాణాల గురించి పిల్లలకు సోదాహరణంగా వివరించాలి. మన పురాణ పురుషుల గొప్పదనాన్ని యువతకు తెలియచెప్పాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు
“ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగింది. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖలో పెట్టబోతోంది. అలాగే ఇంకా చాలా కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి. ప్రాంతాల వారీగా ఏయే రంగాల్లో అభివృద్ధి చేయవచ్చో ప్రణాళికలు వేసుకుని రూపొందించాం.”అని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి పాల్గొన్నారు.
