మొంథా తుపాను ప్రభావిత గ్రామాల్లో గుర్తించిన 3520 కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలి: కలెక్టర్
నెల్లూరుజిల్లా: ఇటీవల జిల్లాలో సంభవించిన మొంథా తుపాను ప్రభావిత గ్రామాల్లో గుర్తించిన 3520 కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో మొంథా తుపాను ప్రభావిత గ్రామాల బాధితులకు కల్పించాల్సిన మౌలికవసతులపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొంథా తుపాను సమయంలో జిల్లాలో 3520 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారు నివసిస్తున్న గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు సంభవించినా వీరందరూ సురక్షితంగా ఆయా గ్రామాల్లోనే ఉండేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా కలెక్టర్ వివరించారు. వీరందరికి ఆయాశాఖల అధికారులు నిర్దేశిత సమయంలోగా ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలన్నారు.
గుర్తించిన వారిలో 780మందికి ఆధార్‌కార్డులు లేవని, 820మందికి రేషన్‌కార్డులు లేవని, జనవరి 31లోగా వీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిఇవో, సివిల్ సప్లయిస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 1400మంది మహిళలను పొదుపుసంఘాల్లో సభ్యులుగా చేర్పించాలని డిఆర్‌డిఎ పీడీకి సూచించారు. 1300మందికి బ్యాంకు అకౌంట్లు ప్రారంభించాలని ఎల్‌డిఎంకు సూచించారు. 1800మంది ఇళ్ల స్థలాలు, 1000మందికి ఇళ్లు, ఇంటి మరమ్మతులు చేపట్టాలని హౌసింగ్ అధికారులను, డిఆర్‌వోను ఆదేశించారు. జాబ్‌కార్డులు, ఫిషర్‌మెను మెంబర్‌షిప్ ఇప్పించాలన్నారు. సామాజిక పింఛన్లు 20మందికి, 43మందికి తల్లికి వందనం, 438మందికి దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. 34మంది పిల్లలు బడికి వెళ్లకుండా ఉన్నారని, వారందరిని పాఠశాలల్లో చేర్పించాలని డిఇవోను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ 3520 కుటుంబాలకు గుర్తించిన అన్ని సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశించిన గడువులో కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్‌వో విజరుకుమార్, జడ్పీ సిఇవో శ్రీధర్‌రెడ్డి, డిపివో వసుమతి, డిఆర్‌డిఎ, మెప్మా పిడిలు నాగరాజకుమారి, గంగాభవాని, ఎల్ డి ఎం మణి శేఖర్, ఫిషరీస్ జెడి డాక్టర్ శాంతి, మెప్మా పిడి లీలారాణి తదితరులు పాల్గొన్నారు.
