రేపటి నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే పర్యటన.
విషయం: రేపటి నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే పర్యటన.
నవంబర్ 2, 8 వరకు నార్వే లో పర్యటించనున్న భారత ఎంపీల బృందం.
లింగ సమానత్వంపై నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాం
EFTA దేశాలతో వాణిజ్యం పెరుగుదలకు దోహదం.
ఆక్వా, అరకు కాఫీ సహా రాష్ట్రం నుంచి ఎగుమతులకు కల అవకాశాలను పరిశీలించే సువర్ణావకాశం అన్న ఏలూరు ఎంపీ.
ఏలూరు/ఢిల్లీ: లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో, ఆదేశ రాజధాని ఓస్లో లో నవంబర్ 2నుంచి 8వరకూ జరగబోయే సదస్సు, నార్వే ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరవుతున్నారు. ఈ సదస్సుకు భారతదేశం తరపున ఎంపీ మహేష్ కుమార్ సహా ఏడుగురు ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాంలో భాగంగా జరిగే ఈ పర్యటనలో ఎంపీ తో సహా భారత ప్రతినిధి బృందం వారం రోజులపాటు నార్వే లోని ఓస్లో, ట్రోంసో నగరాల్లో పర్యటించనుంది. ప్రపంచంలోనే లింగ సమానత్వం ఎక్కువగా ఉన్న దేశాల్లో నార్వే ఒకటి అనేది తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నార్వే పార్లమెంట్ తో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యే భారత ఎంపీల బృందం ఆ దేశంలో లింగ సమానత్వం, మహిళ సాధికారత అమలవుతున్న తీరును పరిశీలించనుంది.
మహిళా సాధికారత అమలు విధానాలను పరిశీలించడంతోపాటు నార్వే దేశంతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడం కూడా భారత ఎంపీల బృందం పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం. గత ఏడాది కుదిరిన ఇండియా-యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ ఒప్పందం (TEPA) 01 అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా EFTA దేశాల్లో ఒకటైన నార్వే పర్యటన వాణిజ్య పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ ఎగుమతులపై ఇటీవల అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల వైపు భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ పర్యటన కోసం శనివారం రాత్రి నార్వే బయలుదేరనున్న సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ మహిళా సాధికారత అంశంతోపాటు, మన రాష్ట్రానికి చెందిన అరకు కాఫీ, ప్రాసెస్ చేసిన పండ్లు, కూరగాయలు, ఆక్వా వంటి ఉత్పత్తుల ఎగుమతికి నార్వే లో కల అవకాశాలను పరిశీలించేందుకు కూడా నార్వే పర్యటన ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. ఇటువంటి కీలకమైన పర్యటనకు తనను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలులకు ఈ సందర్భంగా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
