రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే: ముఖ్యమంత్రి చంద్రబాబు

0
FB_IMG_1766752794458

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం

పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి?

గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు

అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు

తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి వి. అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు సీఎం పోలీసు దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వరస్వామి నెలకున్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

రౌడీయిజంపై ఉక్కుపాదం

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదన్నారు. బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారని, గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పారేసి పోయారని అన్నారు. ఆ తర్వాత అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పెట్టుకోవాలన్నారు.

రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతు బలులు ఇచ్చి పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందని సీఎం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను సీఎం అభినందించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడంలోనూ, పీడీ యాక్టుల అమలులోనూ పోలీసులు చూపుతున్న చొరవను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్త సహా ఇతర సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *