ల్యాండ్ పూలింగ్ కు వ‌డ్డ‌మాను గ్రామ రైతులంతా సానుకూలంగా ఉన్నారు: మంత్రి నారాయ‌ణ‌

0
IMG-20251210-WA1045

అమ‌రావ‌తి: రాజ‌ధాని కోసం భూములిచ్చే రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని మంత్రి నారాయ‌ణ మ‌రోసారి స్ప‌ష్టం చేసారు. గ‌త ప్ర‌భుత్వం నిర్వాకం వ‌ల్లే రాజ‌ధాని నిర్మాణ ప‌నులు ఆల‌స్యం అయ్యాయ‌ని మంత్రి అన్నారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని తుళ్లూరు మండ‌లం వ‌డ్డ‌మాను గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్,సీఆర్డీఏ అద‌న‌పు క‌మిష‌న‌ర్ భార్గ‌వ్ తేజ‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌టించారు. గ్రామంలోని రైతుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రాజ‌ధానిలో రైల్వే ట్రాక్,రైల్వే స్టేష‌న్,ఇంట‌ర్నేష‌న‌ల్ స్పోర్ట్స్ సిటీ,ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోసం వ‌డ్డ‌మాను గ్రామంలో ప్ర‌భుత్వం ల్యాండ్ పూలింగ్ చేయ‌నుంది. దీనికి సంబంధించి రైతుల సందేహాల‌ను నివృత్తి చేసేందుకు మంత్రి నారాయ‌ణ రైతుల‌తో స‌మావేశం ఏర్పాటుచేసారు. ఈ స‌మావేశంలో రైతులు త‌మ అభిప్రాయాల‌ను మంత్రి నారాయ‌ణ‌కు విన్న‌వించారు. ల్యాండ్ పూలింగ్ కు రైతులంతా అనుకూలంగా ఉన్నార‌ని మంత్రి మీడియాతో మాట్లాడారు.

రైతుల‌కు ల్యాండ్ పూలింగ్ లో స‌మ‌స్య‌లు లేకుండా చూస్తాం

రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతుల భూముల విలువ పెర‌గాలంటే ఇంట‌ర్నేష‌న‌ల్ స్పోర్ట్స్ సిటీ,ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్,స్మార్ట్ ఇండ‌స్ట్రీలు వ‌స్తేనే అభివృద్ది చెందుతుంది. సీఎం చంద్ర‌బాబు గారికున్న అపార అనుభ‌వంతో ఆయా ప్రాజెక్ట్ ల కోసం భూస‌మీక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఆయా ప్రాజెక్ట్ ల కోసం 16,666 ఎక‌రాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. రైతుల‌తో స‌మావేశంలో వారి అభిప్రాయాలు తీసుకున్నామ‌న్నారు మంత్రి. ల్యాండ్ పూలింగ్ కు రైతులంతా అనుకూలంగా ఉన్నార‌ని ఎవ‌రూ వ్య‌తిరేకంగా లేర‌ని అన్నారు. గ‌త ల్యాండ్ పూలింగ్ ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని రైతులెవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. 2019లో ప్ర‌భుత్వం మారిపోవ‌డం,గ‌త ప్ర‌భుత్వం కోర్టుల్లో కేసులు వేయ‌డంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. రైతుల విన‌తుల‌ను ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ తో క‌లిసి ప‌రిష్క‌రిస్తాన‌ని కొన్ని స‌మ‌స్య‌ల‌ను సీఎం చంద్ర‌బాబు తో చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని తెలిపారు.

రైతుల ప్లాట్ల‌లో త్వ‌రిత‌గ‌తిన అభివృద్ది ప‌నులు చేప‌డ‌తాం

ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చే రైతుల‌కు రిట‌ర్న‌బుల్ ప్లాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన కేటాయించ‌డమే కాకుండా మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కూడా వేగంగా చేస్తామ‌ని మంత్రి చెప్పారు. వ‌డ్డ‌మాను గ్రామంలోకి వెళ్లే అప్రోచ్ రోడ్డును వెంట‌నే నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుతం రాజ‌ధానిలోని 29 గ్రామాల్లో మౌళిక వ‌స‌తుల కోసం డీపీఆర్ సిద్దం చేస్తున్నామ‌ని వాటితో పాటే వ‌డ్డ‌మాను అభివృద్దికి డీపీఆర్ రూపొందించి అభివృద్ది చేస్తామ‌ని మంత్రి తెలిపారు. రైతుల‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌బోమ‌ని గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల వ‌ల్ల వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌తో పాటు వ‌ర్షాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో నిర్మాణ ప‌నులు ఆల‌స్యం అయ్యాయ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.

నోటిఫికేష‌న్ కు ముందే ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చిన ముగ్గురు రైతులు

రైతుల‌తో స‌మావేశంలో వ‌డ్డ‌మాను కు చెందిన ముగ్గురు రైతులు త‌మ భూముల ద‌స్తావేజుల‌ను ల్యాండ్ పూలింగ్ కొర‌కు మంత్రి నారాయ‌ణ‌,ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ కు అంద‌జేసారు. మైనేని స‌త్య‌నారాయ‌ణ 5 ఎక‌రాలు,పిన్న‌క త‌రుణ్ సాయి 2 ఎక‌రాలు,నిడ‌ద‌వోలు శివ‌పార్వ‌తి 4 ఎక‌రాల భూమికి సంబంధించిన ప‌త్రాల‌ను మంత్రికి అంద‌జేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *