శరవేగంగా జరుగుతున్న 16వ తేదీన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లు
అమరావతి: మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించి, 16వ తేదీన జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సభా వేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ మరియు వీఐపీలకు ఏర్పాటు చేసే వసతులు, ఇతర జిల్లాల నుండి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలపై
సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని సజావుగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని, తగినంత పోలీస్ బలగాలతో సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హోం మంత్రి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ సత్య యేసు బాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్, బెటాలియన్ కమాండెంట్ (ఎస్పీ) నగేష్ ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
