సరికొత్త ఆలోచనలతో జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి
పాలు, మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెంపుతో రైతులకు స్థిర ఆదాయం
పాడి–పశుసంవర్ధక రంగాల ప్రగతితో జిల్లా జిడిపికి ఊతం
పశుసంవర్ధక శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దిశానిర్దేశం
నెల్లూరు: జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ పాలు, మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచే దిశగా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.

కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పశుసంవర్ధక శాఖ ప్రగతిపై ఆ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల వివరాలను వివరించారు.
అనంతరం పాడి, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అధికారుల అభిప్రాయాలను సేకరించి విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగం తరువాత పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలు అత్యంత కీలకమైనవని, వినూత్న ఆలోచనలతో పాడి పరిశ్రమను జిల్లాలో అగ్రస్థానంలో నిలబెట్టవచ్చని తెలిపారు. పశుసంవర్ధక రంగం రైతులకు నిరంతర ఆదాయ వనరుగా మారే అవకాశాలు అపారం గా ఉన్నాయని, దీనివల్ల జిల్లా జిడిపి వృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, పంట నష్టాల కారణంగా వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ, మేకలు–గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాలు రైతులకు అదనపు ఆదాయం అందించే కీలక సాధనాలుగా మారుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పాలు మాత్రమే కాకుండా మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెంపుపై కూడా రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆధునిక పౌల్ట్రీ యూనిట్లు, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ, మేకలు–గొర్రెల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, రుణాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే గ్రామీణ ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు తమ పరిధిలోని మండలాల్లో పాడి, పౌల్ట్రీ, పశుపోషణ పరిశ్రమలకు ఉన్న అవకాశాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులు, యువత ముందుకు వచ్చి పాడి–పశుసంవర్ధక రంగాల్లో పెట్టుబడి పెట్టి జిల్లాను పాడి పరిశ్రమలో ముందంజలో నిలిపేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు నాగరాజకుమారి, గంగా భవాని, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
