సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
నెల్లూరు : జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా 
కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో జిల్లాలో రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనుల మరమ్మతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికి పైగా నీటితో నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూగర్భజలాలు పెరిగేందుకు చెరువులను నీటితో నింపాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు సంబంధించి చేపట్టాల్సిన పనులకు వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. కండలేరు, సర్వేపల్లి రిజర్వాయర్ల వద్ద అత్యవసరంగా పనులు చేపట్టేందుకు కలెక్టర్ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ స్కీం (రిపేర్స్, రెనోవేషన్, రెస్టొరేషన్) కింద ఎంపిక చేసిన పనులపై వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. పంటకాలువలు, చెరువుల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులు, రిజర్వాయర్ల వద్ద షట్టర్ల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద చెరువులు, కాలువల బలోపేతానికి పనులు చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. రైతులందరికీ ఉద్యానవన పంటలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని ఉద్యానవనశాఖ అధికారికి సూచించారు. వ్యవసాయశాఖ తరపున రైతులకు సబ్సిడీ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో కూడా పండ్లతోటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈలు దేశ్‌నాయక్, వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డ్వామా పీడీ గంగాభవాని, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఫిషరీస్ జెడి శాంతి, ఇరిగేషన్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
