సౌత్ ఆఫ్రికాలో కామారెడ్డి జిల్లా వాసి అనుమాదాస్పద మృతి
సౌత్ ఆఫ్రికాలో కామారెడ్డి జిల్లా వాసి అనుమాదాస్పద మృతి

బతుకుదెరువు కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన దీపావళి పండుగ రోజు మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే… కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్( 32 ) బోరు బండి ఆపరేటర్ గా సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువకుడు నివాసం ఉండే ఇంటి వెనకాల, చెట్టుకు ఉరి వేసుకొని శవమై కనిపించడం కుటుంబ సభ్యులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
అక్కడి నుంచి పంపిన ఫోటోలను ఒకటికి రెండుసార్లు పరిశీలించగా, దారుణంగా హతమార్చి, ఆత్మహత్య, చేసుకున్నట్లు చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
గత ఐదారు సంవత్సరాలుగా అదే దేశం వెళుతున్న శ్రీనివాస్, ఐదు నెలల క్రితమే ఇండియాకు వచ్చి వెళ్ళాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతునికి భార్య నవనీత, కూతురు లాస్య, కుమారుడు నిహాల్, తండ్రి బలరాం, తల్లి స్వరూప ఉన్నారు. పండుగ రోజు ఇక్కడున్న కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ మరణ వార్త తీరని విషాదాన్ని నింపింది. అక్కడి నుంచి మృతదేహం స్వదేశానికి రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు.
