హరిహర వీరమల్లు కథపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలి: వి.శ్రీనివాసరావు…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
హరిహర వీరమల్లు కథపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలి: వి.శ్రీనివాసరావు…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సినిమా హీరో, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
” మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన ‘హరిహర వీరముల్లు’ చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన
ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ అని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను. బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
‘హరిహర వీరమల్లు’ పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సఅష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు, వాస్తవాలకు కట్టు కథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.
కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం అనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు వారి నుండి నాదిర్ షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది. బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. అయితే, మీ సినిమాలో బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం.
మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో, అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది. యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాము. బ్రిటీష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.
మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోడీ ప్రభుత్వం… కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు. అది మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి , ప్రజలకు నష్టమని గుర్తించాలి” అని వి.శ్రీనివాసరావు తన లేఖలో పేర్కొన్నారు.
