హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి సవిత
అమరావతి: సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తో మంత్రి ఫోన్ మాట్లాడుతూ, హాస్టల్ లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుకు పైగా రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన ఆదివారం విడుదల చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజ వర్గం ఓడీ చెరువు మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో లక్ష్మీనరసింహా తొమ్మిదో తరగతి,
భార్గవ్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. హాస్టల్ సమీపంలోని బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసుకున్న మండపానికి ప్రసాదం కోసం వంట పాత్రలతో వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఇద్దరు విద్యార్థులను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ నరసింహా తలకు బలమైన గాయం కావడంతో అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి భార్గవ్ ను కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి, విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలన్నారు. వంట పాత్రలిచ్చి ప్రసాదం ఎవరు తీసుకు రమ్మనారో తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపైకి ఎందుకొచ్చారని డీఎస్సీడబ్ల్యూవో రెడ్డి బాలాజీని మంత్రి ఫోన్ లో ప్రశ్నించారు. తక్షణమే గాయడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమందించాలని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
