3వ ప్రపంచ తెలుగు మహాసభలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి ఆహ్వానం
జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరు వేదికగా జరగనున్న తెలుగు పండుగ
ఆహ్వాన పత్రికను అందజేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్
నర్సీపట్నం: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2026లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “3వ ప్రపంచ తెలుగు మహాసభల”కు ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా కోరుతూ, పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
స్పీకర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో, డాక్టర్ గజల్ శ్రీనివాస్ మహాసభల విశేషాలను స్పీకర్ కి వివరించారు. “తెలుగు వారి అనురాగ సంగమం” అనే నినాదంతో, 2026 జనవరి 3, 4 మరియు 5 తేదీలలో గుంటూరు, అమరావతిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ (సాయి బొమ్మిడాల నగర్) వేదికగా ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు.
ఈ మహాసభలలో ప్రధాన వేదికకు “దివ్యశ్రీ నందమూరి తారక రామారావు వేదిక” గా నామకరణం చేశామని, అలాగే శ్రీనాథ కవి, జాషువా, ఘంటసాల వంటి మహనీయుల పేర్లతో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు అవధానాలు, సంగీత విభావరి, సాహిత్య సదస్సులు, జానపద కళలు, నాటక ప్రదర్శనలతో తెలుగు భాషా వైభవాన్ని చాటేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ స్పీకర్ కి వివరించారు.
ఈ ఆహ్వానంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు పేరుతో ఈ మహా వేదికను నిర్వహిస్తుండడం తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తాను తప్పకుండా పాల్గొంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు.
స్పీకర్ ని కలిసిన వారిలో వైస్ ప్రెసిడెంట్ మేడికొండ శ్రీనివాస్ చౌదరి, సలహాదారు (Advisor) అడ్డాల వాసు నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర, ఇతర టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు
.
