అభ్యర్థుల నిజాయతీకి ప్రాధాన్యత ఇవ్వాలి: రాష్ట్రపతి

0
IMG-20251219-WA1034

తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నైపుణ్యాల కంటే ముందు వారి నిజాయతీ, సమగ్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.

ఈ రెండు లక్షణాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆమె అన్నారు. తెలంగాణ(Telangana) పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్‌ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి ముఖ్య ప్రసంగం చేశారు. రాష్ట్రపతి మాట్లాడుతూ, అభ్యర్థుల్లో నైపుణ్యాలు లోపిస్తే శిక్షణ ద్వారా మెరుగుపరచవచ్చని, కానీ నిజాయతీ, చిత్తశుద్ధి లేకపోతే పరిపాలన వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అందుకే నియామక ప్రక్రియలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సేవలోకి వచ్చే యువత సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే భావన కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

మహిళల పట్ల సున్నిత దృష్టి అవసరం

ప్రభుత్వ పాలనలో మహిళల అవసరాలు, సమస్యల పట్ల సివిల్ సర్వెంట్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్రపతి అన్నారు. అభ్యర్థుల్లో జెండర్ సెన్సిటైజేషన్‌ను పెంపొందించేలా పీఎస్‌సీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వ పథకాలు మహిళలకు మరింత సమర్థవంతంగా చేరతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

నిష్పాక్షికత, స్థిరత్వం, నిరంతరత వంటి లక్షణాలు ప్రభుత్వ పాలనకు అందించేది శాశ్వత కార్యనిర్వాహక వర్గమేనని(Telangana) ఆమె పేర్కొన్నారు. ఈ కీలక బాధ్యతగల అధికారులను ఎంపిక చేసే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లదేనని గుర్తు చేశారు. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయాలని రాష్ట్రపతి సూచించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో పీఎస్‌సీలు ఎంపిక చేసే అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, యూజీసీ చైర్మన్ వినీర్ జోషి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *