ఫోన్ ట్యాపింగ్ కేసు – మళ్లీ మొదటి నుంచి విచారణ !
తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సజ్జనార్ నేతృత్వంలో సిట్ నియమించారు. ఇప్పుడా సిట్ మళ్లీ మొదటి నుంచి దర్యాప్తుచేయాలని నిర్ణయించుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సమావేశమైంది. ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తును సమీక్షించి మళ్లీ అందర్నీ పిలిచి ప్రశ్నించాలని నిర్ణయించింది.
కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే కాకుండా, దీని వెనుక ఉన్న పెద్దల హస్తంపై కూడా సిట్ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి వారైనా సరే విచారించాలని సమావేశంలో నిర్ణయించారు. రాజకీయ నేతలు, మాజీ ఉన్నతాధికారుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో, రాబోయే రోజుల్లో నోటీసుల పరంపర ఉండనుంది.
కేసులో మాజీ పోలీస్ అధికారులు రాధా కిషన్ రావు, ప్రణీత్ రావు వంటి అధికారుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో నగదు తరలింపును పట్టుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ వ్యవస్థను వాడారని దర్యాప్తులో తేలింది. కేసు బయటపడే సమయంలో నిందితులు హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం, డేటాను డిలీట్ చేయడం వంటివి చేశారు.
ఈ కేసులో సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, స్టేట్మెంట్లను క్రోడీకరించి పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. కోర్టులో కేసు వీగిపోకుండా ఉండేలా అత్యంత పక్కాగా ఆధారాలను పొందుపరచాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే మళ్లీ అందర్నీ ఓ సారి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది.
