అనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్

0
IMG-20251223-WA1447

తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం.

200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు.

ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు పూర్తి.

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ: మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు రెండు వందల సంవత్సరాల కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేస్తున్నామని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మొక్కిన మొక్కులు తీర్చే తల్లులను దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్ల దీవెనలు పొందుతున్నారని తెలిపారు.

రాష్ట్రమంత్రి ధనుసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్,
ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను, సాండ్ స్టోన్ బొమ్మల లిపి చిత్రాలను, క్యూ లైన్ నిర్మాణ పనులను, గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణ పనులను, ఆలయ ఫ్లోరింగ్ పనులను , ఆలయ ప్రహరీలో వెదురు బొంగు మాదిరిగా ఉన్న స్తంభాలను,మేడారంలో చిలుకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్.టి.సి. బస్ స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అనంతరం మేడారంలోని హరిత హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులతో, గుత్తేదారులతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి కూలంకశంగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ పనులు, రాత్రి నిర్మాణ పనులు , సివిల్ వర్క్స్ , గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్లను పనులు డిసెంబర్ 31వ తేదీ లోపు, ఇతర పనులు జనవరి 5వ తేదీ లోపు పూర్తి పూర్తిచేయాలని సంబంధిత అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. ప్రధాన ద్వారం పనులు కూడా జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని అధికారులు చిత్తశుద్ధితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆలయ ప్రాంగణం గద్దెల పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా త్వరితగతిన లైటింగ్ పనులను పూర్తి చేయాలని రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని , గద్దెలకు చేరుకునే హరిత వై జంక్షన్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు సెంట్రల్ లైటింగ్ పనులను కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. జాతర సమయంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రతిపాదికన వాటర్ ట్యాంకులను నిర్మించాలని అధికారులు పనులను విభజన చేసుకొని సకాలంలో నిర్దేశించిన గడువులోపు పూర్తి ఆదేశించారు. జాతరకు వచ్చే అన్ని రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, ఐటిడిఏ ఆద్వర్యంలో తాత్కాలిక పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యతకి ఇవ్వాలని, సుందరీకరణ కూడలిలో గ్రాస్ ప్లాంటేషన్ పనులు, రహదారికి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటించాలని అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు వచ్చే జాతర కు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహిస్తుందని గతంలో కంటే కూడా 200 శాతం భక్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నారు.

అధికారులు పట్టుదలతో 31వ తేదీ లోపు పనులను పూర్తి చేయాలని, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపద్యం లో పోలీస్ శాఖ ఆర్ అండ్ బి అధికారులు సమన్వయం లో పని చేయాలని, వన దేవతల ఆశీసుల తో పనులు సాఫీగా సాగుతున్నాయని మంత్రి అనసూయ సీతక్క అన్నారు.

గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతరను విజయవంతం చేయాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారు

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలచే పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, తక్కువ సమయంలో 100 శాతం పని చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. చిన్న చిన్న అవాంతరాలు కలుగుతున్నప్పటి వచ్చే సంవత్సరం జనవరి 5 వ తేదీ లోగా పనులు పూర్తి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానిస్తున్నామని, అమ్మవార్ల దీవెనలు ప్రతి ఒక్కరిపై, దేశంపై ఉండాలని అన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులను దేవాలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులు ఎంతగానో ఆకట్టుకోనున్నాయని, నిస్వార్ధంగా దైవ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గద్దెల ప్రాంతాలలో విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడంతో రోడ్డు విస్తరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా 29 ఎకరాల భూసేకరణ చేపట్టి పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలు ఇతర ప్రాంతాల నుండి తీసుకు రావడం కారణంగానే ఆలయ పునరుద్ధరణ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. పాలరాతి శిల్పాలపై గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు పూర్తి అవుతాయని అభిప్రాయపడ్డారు. రాబోయే తరాల వారికి అమ్మవార్ల చరిత్రలు తెలిసే విధంగా శిల్పాలను ఏర్పాటు చేస్తున్నామని, స్వస్తిక్ ఏర్పాటు విషయంలో గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేస్తున్నామని దీనిపై ఎవరు రాద్ధాంతం చేయవద్దని కోరారు. పకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ల గొట్టు , గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నామని, తామంతా ఒక టీం గా పనిచేస్తూ జాతరను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహా జాతరను పురస్కరించుకొని ప్రతి గడప గడప నుండి భక్తులు వచ్చి అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరుతూ, జాతర విశిష్టతపై పాత్రికేయులు సైతం ప్రచారం చేయాలని కోరారు.

ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ మహా జాతరను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలతో పనులు చేపట్టడం అర్శించదగ్గ విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *