సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు: సీఎం చంద్రబాబు:
అమరావతి: సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ”తందనానా – 2025”లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పతకాలను బహుకరించారు. 



రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మీ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ “సంగీతం, సాహిత్యం, సంస్కృతులే విలువలు నేర్పే సాధనాలు భారతీయ మూలాలు. భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తనలు రచించారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్స్ ప్రాంతంలో అన్నమయ్యపురం ఏర్పాటు చేశాం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు గత 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావనా వాహిని సంస్థను అభినందిస్తున్నా. ‘తందనాన’ పేరుతో అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తనా పోటీలను శోభారాజు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భావితరాలకు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని అందించిll యువ కళాకారులను అత్యున్నత స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. 12 దేశాల్లో 700పైగా కచేరీలు నిర్వహించారు. అన్నమయ్య కీర్తనలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో చెప్పారు. శోభారాజు అన్నమయ్య కీర్తనలకు ఒక బ్రాండ్‌గా నిలుస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోని అన్నమయ్యపురంను సందర్శిస్తాను”అని ముఖ్యమంత్రి చెప్పారు.
