రోహిత్‌, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్‌!

0

టీమిండియా స్టార్‌క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్‌ కోచ్‌గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌ వైఫల్యం అనంతరం రోహిత్‌, విరాట్‌లు ఏకకాలంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్‌ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది.

‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్‌ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్‌గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్‌లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్‌కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా.

అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ల ఓటమి తర్వాత కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్‌ స్వాగతించగా, రోహిత్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్‌ శర్మను టెస్టు కెప్టెన్‌గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్‌ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్‌ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్‌మన్‌ గిల్‌కు అప్పగించారు. గిల్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లపై టెస్టు సిరీస్‌లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్‌ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *