భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు

0

భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు


పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

ప్రజల సహాయార్థo కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు

కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699

జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

నెల్లూరు జిల్లా: భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.

నేడు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో భారీవర్షాలపై మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, యంత్రాంగం ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ ఎవరూ సముద్రంలోనికి వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలన్నారు. సోమశిల ప్రాజెక్టు పరివాహాక ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందించేందుకు బియ్యం, సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వర్ష ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

నీటి మునిగిన పంట పొలాల ప్రాథమిక నివేదిక సిద్ధం చేయండి : కలెక్టర్‌

నీటి మునిగిన పంట పొలాల వివరాలను సేకరించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో పంట పొలాలు ఎంతమేర నీటమునిగాయో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు అందించాలని సూచించారు.

నేడు పాఠశాలలకు సెలవు : కలెక్టర్‌

తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 22న (బుధవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు : కలెక్టర్‌

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. కంట్రోలు రూంలో 24 గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 24 గంటల పాటు ఈ కంట్రోలు రూం పనిచేస్తుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *