ఏపీకి రండి..పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

0

ఏపీకి రండి..పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శన వేదికగా ఇన్వెస్టర్లను ఆహ్వానించిన మంత్రి కందుల దుర్గేష్

ఏపీ టూరిజం సెక్టార్ లో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని, సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పిలుపు

ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ఎగ్జిబిషన్ చక్కని వేదికగా ఉపయోగపడిందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్*

అమరావతి:ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ఎగ్జిబిషన్ చక్కని వేదికగా దోహదపడిందని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను సాదరంగా ఆహ్వానించారు. రెండో రోజు లండన్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నే ఎందుకు ఎంచుకోవాలి, ఏపీకి ఉన్న ప్రత్యేకతలేమిటి, ఏపీలో పెట్టుబడులు పెడితే ఎన్డీయే ప్రభుత్వం కల్పించే రాయితీలు ఏమిటి అన్న విషయాలను అక్కడికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో పంచుకున్నారు. అదే విధంగా ఏపీ స్టాల్ ద్వారా పర్యాటక రంగంలో అమలు చేస్తున్న నూతన పర్యాటక పాలసీ విధానాలను, పర్యాటక హోదా కల్పన తదితర అంశాలను కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చి పర్యాటక ప్రదేశాలను చూడండి అని, రాష్ట్ర సహజ సౌందర్యాలను ఆస్వాదించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ట్రాన్స్ ఇండస్ కంపెనీకి చెందిన యూకే లీడింగ్ ఏషియా ట్రావెల్ స్పెషలిస్ట్ హరి దగ్గుబాటి, ఏకే ట్రావెల్ ఏజెన్సీ ఫౌండర్ ఆంథోని కింగ్స్లే, యూరోప్, నార్త్ ఆఫ్రికాకు చెందిన సీఎంసీవో సంస్థ మైస్ స్పెషలిస్ట్ క్రిస్ ఫోర్డ్, తమిళనాడు టూరిజం బోర్డు డైరెక్టర్ జెక్కు కురియన్ కురియాకోస్ తదితర ప్రతినిధులతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లికా రేడియో ఛానల్ ప్రజెంటర్ రూబిరాజ, ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్ ఆన్ లైన్ ట్రావెల్ పబ్లికేషన్ ఎడిటర్ లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల ద్వారా ఏపీ పర్యాటక వాణిని వినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగంలో అమలు చేస్తున్న విధి విధానాలను వెల్లడించి పలువురు ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు డబ్ల్యూటీఎం సరైన వేదికగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో ఏపీ పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ఇన్వెస్టర్లు ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే మరింత వృద్ధి సాధించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తాము రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులను ఆకర్షించామన్నారు. ఈ క్రమంలో క్యారవాన్, హోమ్ స్టే, టెంట్ సిటీ, ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీలను వివరించారు. పర్యాటక పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పలు రాష్ట్రాల్లో, దేశాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత స్టార్ హోటళ్లు, బీచ్ రిసార్ట్స్ ఏపీకి వచ్చాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ పార్ట్ నర్స్ పర్యాటక రంగాన్ని వృద్ధి చేసేందుకు తమదైన శైలిలో ముందుకు వస్తున్నారన్నారు.

ఇతర రాష్ట్రాలతో,దేశాలతో అనుసంధానం చేసేందుకు ఏపీకి రోడ్డు,జల, వాయు, రైలు తదితర మార్గాలు అనేకం ఉన్నాయన్నారు. కడప, కర్నూలు, తిరుపతి, విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయన్నారు.త్వరలోనే ఏపీలోని ప్రతి జిల్లాల్లో ఒక ఎయిర్ పోర్ట్ నెలకొల్పేందుకు సంకల్పించామన్నారు. తద్వారా మరిన్ని ప్రాంతాలకు నేరుగా అనుసంధానం ఉంటుందని భావిస్తున్నామన్నారు. విభిన్న మార్గాలతో ఇండియాలోనే ఏపీ అత్యధిక కనెక్టివిటీ ఉన్న ప్రాంతంగా నిలిచిందన్నారు.

2014న ఏపీ రాష్ట్రం విభజనకు గురైందని, అనంతరం పర్యాటకాన్ని అభివృద్ధి చేశామని, కానీ 2019-24లో ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పర్యాటక రంగాన్ని కుదేలు చేసిందని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని,వారి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్ర పర్యాటక రంగంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు.రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించారని, పారిశ్రామిక రంగానికి ఇచ్చే అన్ని రకాల రాయితీలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అందిస్తున్నామని వెల్లడించారు. నూతన పర్యాటక పాలసీ – 2024-29 తో పర్యాటక రంగానికి ఊతం వచ్చిందన్నారు. విభిన్నమైన పర్యాటక ప్రదేశాలతో కూడిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇక్కడ ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, హెరిటేజ్, బీచ్, క్రూజ్ తదితర పర్యాటక ప్రక్రియల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని అన్నారు. రాష్ట్రంలో సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాలు అందిస్తున్నామన్నారు. సుదీర్ఘమైన సముద్ర తీరం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, సూర్యలంక, నెల్లూరులో అందమైన బీచ్ లు, తిరుపతి, విశాఖపట్నం, అమరావతి(విజయవాడ) లాంటి మూడు ప్రధాన నగరాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. విశాఖకు సమీపంలో దట్టమైన అడవులతో కూడిన అరకువ్యాలీ, లంబసింగి, అనంతగిరి లాంటి అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలను మరింత వృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తొట్లకొండ, బావి కొండ, బొజ్జనకొండ, నాగార్జునకొండ, అమరావతి, ఘంటసాల, విజయవాడ తదితర ప్రదేశాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ- చెన్నై- పాండిచ్చేరికి క్రూజ్ టూరిజంను ప్రారంభించి పర్యాటకులకు సముద్రతీర అనుభవాలను అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.అదే విధంగా రాష్ట్రంలో చాలా సంఖ్యలో టైగర్ రిజర్వ్స్, దట్టమైన అడవులు, గిరిజన ప్రాంతాలు ఉన్నాయన్నారు.వీటన్నింటిని పీపీపీ విధానంలో మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *