రైతుల కోసం ఆరాటం,చివరి వరకూ పోరాటం

0

రైతుల కోసం ఆరాటం,చివరి వరకూ పోరాటం

రైతు జన బాంధవుడిగా గుర్తింపు..సీనియర్ పార్లమెంటేరియన్ గా రికార్డ్

నేడు ఎన్జీరంగా125 వ జయంతి

“భారతదేశంలోని రైతుల అభివృద్ధికి ఏం చేయాలో..ఎలా చేయాలో.. నాకు తెలుసు…అదంతా చేయటానికి అధికారం గల పదవి నాకు కావాలి..అంత పదవి నాకు రాదు.. అంతకు తక్కువ పదవి నాకు అవసరం లేదు”..సీనియర్ పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జీరంగా ఒకానొక సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. రైతుల పట్ల ఆయనకున్న అపారమైన అభిమానానికి ఇదొక ఉదాహరణ. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేసిన రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్.జీ.రంగా. రైతుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి నిరంతరం శ్రమించిన రైతు నేత ఆయన.5 దశాబ్దాలకు పైగా సుధీర్ఘకాలం సీనియర్ పార్లమెంటేరియన్ గా చరిత్ర సృష్టించారు ఆచార్య ఎన్.జి.రంగా..ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి తన పోరాటాన్ని కొనసాగించారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో1900 సంవత్సరం నవంబర్ 7వ తేదీన రంగా జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక శాస్త్రంలో పట్టభద్రత సాధించారు. విద్యార్థి దశలో కారల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్ పై అధ్యయనం చేశారు. 1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ప్రధానాచార్యులుగా చేరారు. 1929లో జమీందారు రద్దు పై పోరాటం చేశారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో ముందడుగు వేశారు. 1934లో జులై 11న రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగు పెట్టారు.1991 వరకు పార్లమెంటు ఎగువ, దిగువ సభల్లో కొనసాగారు ఆచార్య ఎన్.జీ.రంగా. గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. తన సొంత ఊరు నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా కేంద్రం ఎందరో రాజకీయ నాయకులను తీర్చిదిద్ది ఘనత దక్కించుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వంటి నాయకులు సైతం ఈ పాఠశాలలో శిక్షణ పొందిన వారే. ఒక మహత్తరమైన ఆశయసాధన కోసం పనిచేసిన అరుదైన నాయకుల్లో ఆచార్య రంగా ఒకరని చెప్పడం అతిశయోక్తి కాదు. రైతుల సంక్షేమానికి పాటుపడని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే బలమైన సిద్ధాంతాని నమ్మిన రైతు నేత రంగా.
రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గా నామకరణం చేశారు. బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో 1924లో రైతు ఉద్యమ ప్రణాళికను ఆచార్య రంగా రూపొందించారు. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా రంగా విగ్రహాన్ని నెలకొల్పారు. బాపట్ల ప్రాంతంలో ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన ఆచార్య ఎన్.జి.రంగా ఆ రంగానికి చేసిన సేవలు చిరస్మరణనీయం ప్రశంసనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *