ప్రైవేటు ఆల‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి: అధికారుల‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి కె. విజ‌యానంద్ ఆదేశం

0
FB_IMG_1764595976897

అమ‌రావ‌తి: రాష్ట్రంలోని ప్రైవేటు ఆల‌యాలు, అందులో భ‌క్తుల ర‌ద్దీ ప‌ట్ల అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్‌లో ఆ సంస్థ కార్య‌క‌లాపాలు, పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రోబోయే రోజుల్లో వ‌రుస‌గా పండ‌గ‌లు, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాలు వ‌స్తున్నాయి, కాబ‌ట్టి అన్ని ఆల‌యాల్లోనూ భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుందని చెప్పారు. జిల్లాలో అధికారులు త‌మ త‌మ ప‌రిధిలో ఉన్న ప్రైవేటు ఆల‌యాల ప‌ర్య‌వేక్ష‌ణపైన కూడా దృష్టి సారించాల‌న్నారు. ప్రైవేటు ఆల‌యాల‌ నిర్వాహ‌కుల నుంచి పండుగ‌లు, ప‌ర్వ‌దినాల స‌మ‌యంలో ఆయా ఆలయాల‌కు ఎంత మంది భ‌క్తులు రావ‌చ్చు, ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు ఆల‌య నిర్వాహ‌కులు చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి ముందుగా అధికారుల‌కు తెలియ‌జేయాల‌ని ఆదేశిస్తూ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే భ‌క్తుల ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు ముందుస్తుగా పోలీసుల అనుమ‌తి తీసుకుని, అక్క‌డ త‌గిన బందోబ‌స్తు ఏర్పాటు చేసేలా చూడాల‌న్నారు. త‌ద్వారా ఆల‌యాల వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డానికి ఆస్కారం లేకుండా నిరోధించాల‌ని అధికారుల‌కు సూచించారు. వైకుంఠ ఏకాద‌శి, ధ‌నుర్మాసం త‌దిత‌ర ప‌ర్వ‌దినాలు, పండుగ‌ల వేళ‌ల్లో ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్త‌లు ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు, ఆల‌య నిర్వాహ‌కులు, ధ‌ర్మ‌క‌ర్తలు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి ఒక నిబంధ‌నావ‌ళిని రూపొందించి అన్ని ప్రైవేటు ఆల‌యాల‌కు జారీ చేయాల‌న్నారు.
ప్రైవేటు ఆల‌యాలు త‌మ ప‌రిధి కాద‌నే నిర్లక్ష్యం అధికారుల్లో ఉండ‌కూడ‌ద‌న్నారు. ప్రైవేటు ఆల‌యాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త ప్రైవేటు ఆల‌య నిర్వాహ‌కులు, ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లదే అయిన‌ప్ప‌టికీ, ర‌ద్దీ స‌మ‌యాల్లో ఆయా ఆల‌యాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌యాల్లో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీఠ వేయాల‌ని విజ‌యానంద్ ఆదేశించారు. భ‌క్తుల ర‌ద్దీ స‌మ‌యాల్లో ఆల‌యాల్లో పారిశుధ్య‌లోపం రాకుండా, తొక్కిస‌లాట‌ల‌కు ఆస్కారం లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ర‌బీకి ఎరువుల కొర‌త ఉండ‌దు

ర‌బీ సీజ‌న్‌కు ఎరువుల కొర‌త ఉండకుండా అధికారులు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌ని విజ‌యానంద్ వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌కు సూచించారు. దీనిపై వ్య‌వ‌సాయశాఖాధికారులు స్పందిస్తూ ఇప్ప‌టికే ఎక్క‌డా కూడా ఎరువులు కొర‌త లేకుండా చేశామ‌ని, రైతుల‌కు ఎరువులు స‌మృద్ధిగా ల‌భిస్తున్నాయ‌ని తెలిపారు. వ‌చ్చే ర‌బీ సీజ‌న‌లో రైతుల‌కు స‌మృద్ధిగా ఎరువులు ల‌భ్య‌మయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ర‌బీ సీజ‌న్‌లో ఎరువుల కొర‌త అనే స‌మ‌స్య త‌లెత్త‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌లంతా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను మ‌రింతగా ఉప‌యోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

ఈ స‌మావేశంలో ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్, ఎక్స్ అఫిషియో ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుడితి రాజ‌శేఖ‌ర్, ఏపీ పైబ‌ర్‌నెట్ ఎండీ గీతాంజ‌లి శ‌ర్మ‌, ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ సీఈఓ ధాత్రి రెడ్డి, ఆర్టీజీఎస్ జాయింట్ డైరెక్ట‌ర్ మాలికా గార్గ్‌ త‌దిత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *