గోదావరి డెల్టాకు పూర్వవైభవం: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
అమరావతి/సచివాలయం: గోదావరి డెల్టా ముంపు సమస్య పరిష్కరించడంతో పాటు, ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, దీని కోసం డెల్టా ప్రాంతంలో లైడార్ సర్వే కోసం రూ.13.4 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అమరావతి సచివాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై సంబందిత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ డిసెంబర్ కు గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య మరియు లాకులు, గేట్ల మరమ్మత్తులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీని ఆదేశించారు.
గత 5ఏళ్ళ వైసిపి పాలనలో గోదావరి డెల్టా మోడ్రనైజేషన్ కు నిధులు ఉన్నా పనులు చేయకపోవడమే కాకుండా సగంలో ఉన్న పనులను ప్రీక్లోజర్ చేసి, 150 ఏళ్ళలో గోదావరి డెల్టాకు ఎవరూ చేయలేనంత ద్రోహాం చేసి, డెల్టా అభివృద్దికి, ఆధునీకరణ పనులకు సైంధవుడిలా జగన్ అడ్డుపడ్డారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. ఆధునీకరణ పనులు మధ్యలోనే నిలిపేయడంతో ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య తలెత్తడంతో పాటు లాకులు గేట్లు మరమ్మత్తుల పనులు, డ్రైన్ల లో పూడిక తీత పనులు, ఏటిగట్లను బలోపేతం చేసే పనులు నిలిచిపోయి, పంటలు నాశనమైపోయిన పరిస్దితి వచ్చిందని అన్నారు. దీని కారణంగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ధాన్యాగారంగా ఉన్న గోదావరిడెల్టా లో ఇప్పుడు మొదటి పంట వేయలేని పరిస్దతి వచ్చిందని, రెండో పంట మాత్రమే వేయాల్సి వస్తోందని, ఇలా డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గోదావరి డెల్టాకు పూర్వవైభవం తీసుకొచ్చేలా వెంటనే లైడార్ సర్వే పూర్తి చేసి, డెల్టా ఆధునీకరణ పనులు మొదలుపెట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
గత ప్రభుత్వంలో నిధులు ఉన్నా కూడా కాలువలు, డ్రైన్లలో మట్టితీయకపోగా, లాకులు షట్టర్ల కు కనీసం గ్రీజు పెట్టడానికి ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని, మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజి కి కొత్త గేట్లను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.150 కోట్లును మంజూరు చేశారని ఈసందర్భంగా గుర్తుచేశారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, ఎస్ఈ,ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
