రెండవ సర్వే వక్ఫ్ ఆస్తుల గెజిట్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
అమరావతి
: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఇప్పటికే తమ వద్ద ఉన్న మొదటి సర్వే వక్ఫ్ రికార్డులను 100 శాతం ఉమీద్ పోర్టల్ లో అప్లోడ్ చేసి, దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఉమీద్ పోర్టల్ నమోదుకు వక్ఫ్ ట్రిబ్యునల్ 6 నెలలు గడువు పెంచిన విషయాన్ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రజలకు తెలియచేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఎంట్రీలు, వెరిఫికేషన్లు, అప్రూవల్‌లు పూర్తిచేయడంలో ఆంధ్ర రాష్ట్రం ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం రెండవ సర్వే వక్ఫ్ ఆస్తుల గెజిట్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఉన్న పలు వక్ఫ్ ఆస్తుల పాత రికార్డులు ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వద్ద ఉన్నాయనీ, రికార్డుల బదిలీ కోసం స్వయంగా తానే హైదరాబాద్ వెళ్లి తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ను కలసి చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. చర్చలు సఫలీకృతం కావడంతో తెలంగాణ నుంచి ఏపీ యొక్క పాత రికార్డు లు రాబోతున్నాయని తెలిపారు. రెండవ సర్వే గెజిట్ సమాచారం మరియు తెలంగాణ నుండి వస్తున్న పాత రికార్డు లను ఉమీద్ పోర్టల్ లో నమోదు చేయడానికి అదనపు సమయం అవసరం అవుతున్న నేపథ్యంలో సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఏపీ వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా, ట్రిబ్యునల్ 6 నెలల గడువు మంజూరు చేసిందని ప్రకటించారు. మొదటి సర్వే రికార్డులను 100 శాతం అప్లోడ్ చేసి ఏపీని దేశంలో టాప్ స్టేట్‌గా నిలబెట్టామని, ఇప్పుడు రెండవ సర్వే గెజిట్ మరియు తెలంగాణ రికార్డులను కూడా పూర్తిస్థాయిలో పోర్టల్ లో నమోదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వక్ఫ్ ఆస్తిని చట్ట పరంగా పారదర్శకంగా రక్షించడం వక్ఫ్ బోర్డ్ ప్రధాన లక్ష్యమని ఎటువంటి రాజీ లేదని అన్నారు. డిజిటైజేషన్, రికార్డు శుద్ధికరణ, పారదర్శకత ఇవే తమ ప్రాధాన్యతలనీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యుత్తమ వక్ఫ్ పరిపాలన రాష్ట్రంగా నిలపడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.
