ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన మంత్రి
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన మంత్రి
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలను అందిస్తుందని మంత్రి నారాయణ దుబాయ్ పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు,పాలసీలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ అక్కడి పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు. గత 15 నెలలుగా వచ్చి పెట్టుబడులు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది గురించి పెట్టుబడిదారులకు వివరిస్తున్నారు. వ్యాపారాభివృద్దికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ ఉందనే విషయాన్ని వివరించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి నారాయణ బృందం పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఉదయం అపరెల్(apparel) గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్,సీఈవో నీరజ్,సీబీఓ కమల్ కొటక్ తో సమావేశమయ్యారు.ఫ్యాషన్ వేర్,గార్మెంట్స్,ఫుట్ వేర్,కాస్మొటిక్స్ రంగంలో 14 దేశాల్లో 2300 స్టోర్ లను అపరెల్ గ్రూప్ నిర్వహిస్తుంది. స్కెచర్స్,టామీ హిల్ ఫిగర్ వంటి సుమారు 25 బ్రాండ్లతో తన వ్యాపారాన్ని ఈ సంస్థ కొనసాగిస్తుంది. ఏపీలో వ్యాపారాభివృద్దికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని,పెట్టుబడులు పెట్టాలని అపరెల్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి నారాయణ ఆహ్వానించారు.
మధ్యాహ్నం ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్ తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది.
షిప్పింగ్,లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో ఈ సంస్థ వ్యాపారాలు నిర్వహింది. ఫిప్ బిల్డింగ్,లాజిస్టిక్స్ రంగంలో పేరొందిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ కు రాష్ట్రంలో పోర్టుల అభివృద్దిపై మంత్రి నారాయణ వివరించారు.రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం,పోర్టులు,ఎయిర్ పోర్టుల నిర్మాణంతో పాటు షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి వివరించారు..ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏపీకి వచ్చి ఇక్కడ ఉన్న అపార అవకాశాలను పరిశీలించాలని కోరారు.
ఆ తర్వాత బుర్జిల్ హెల్త్ కేర్ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు.వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను మంత్రి నారాయణ వివరించారు.
మధ్యాహ్నం దుబాయ్ డౌన్ టౌన్ లో ఉన్న తబ్రీద్(Tabreed) కంపెనీ హెడ్ క్వార్టర్స్ ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది.తబ్రీద్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను అందించే కంపెనీ ఈ కంపెనీ సిఈవో ఖలీద్(Khalid),సీడీవో ఫిలిప్(Philippe),ఇతర ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా,దుబాయ్ మాల్ వంటి వాటికి తబ్రీద్ కంపెనీ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలను అందిస్తుంది. ఏసీ లకు బదులు అండర్ గ్రౌండ్ పైప్ నెట్ వర్క్ ద్వారా కూలింగ్ వాటర్ ఇన్ ఫ్రా ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. వేడిని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ కూలింగ్ సెంటర్ ను పరిశీలించారు మంత్రి నారాయణ అమరావతిలోనూ డిస్ట్రిక్ట్ కూలింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన గతంలోనే ఉంది. తబ్రీద్ కంపెనీ ప్రతినిధులను ఏపీకి రావాలని అమరావతితో పాటు అవసరమైన ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ కూలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి.
పారిశ్రామిక వేత్తలతో సమావేశాల్లో విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి ప్రత్యేకంగా వివరించారు మంత్రి నారాయణ ప్రపంచలోని అనేక దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారని దుబాయ్ పెట్టుబడిదారులు కూడా విశాఖ సదస్సుకు హాజరుకావడం ద్వారా ఏపీ అందిస్తున్న సదుపాయాలను పరిశీలించాలని మంత్రి నారాయణ కోరారు.
ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు,మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.
