గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి: సిఎస్
అమరావతి:2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఆయా శాఖలు,జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జరింగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సహ్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఇది మొదటి ప్రాధమిక సమావేశం కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో మంతృల బృందాన్ని,కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జి.వీరపాండ్యను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు.జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖల అధికారులతో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు సూచించారు.ఇప్పటినుండే ఆయా జిల్లాల వారీగా స్నాన ఘట్టాల వారీగా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మైక్రో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.ముఖ్యంగా స్నాన ఘట్టాలను గుర్తించడం,తాగునీరు,పారిశుద్ధ్యం,రవాణా,వైద్య శిబిరాలు,భద్రత,జనసమూహ నిర్వహణ,ట్రాఫిక్ నిర్వహణ,అత్యవసర సేవల సమన్వయం చేయడం వంటి అంశాలపై వివరణాత్మక డిపిఆర్ లను సిద్ధం చేసి పంపడం వంటి చర్యలు చేపట్టాలని కలక్టర్లను ఆదేశిచారు.గత పుష్కరాలతో పోల్చితే ప్రస్తుతం జనాభా పెరగడం,ప్రసార మాధ్యమాలు ప్రసారం,సాంకేతికత పెరగడం,రవాణా సౌకర్యాలు మెరుగుపడడం అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో భక్తిభావాలు పెంపొందడం వంటి కారణాల వల్ల 2027లో జరిగే పుష్కరాలకు రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకనుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు.
మన రాష్ట్రంలో గోదావరి నది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి ఏలూరు, తూర్పు గోదావరి,కాకినాడ,పశ్చిమ గోదావరి,అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీదగా ప్రవహిస్తుందని ఈ ఆరు జిల్లాల్లో వివిధ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేదుంకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ అన్నారు.గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు దేవాదాయ,నీటిపారుదల,రెవెన్యూ,పోలీస్, ఆర్అండ్బి,పురపాలక మరియు పట్టణాభివృద్ధి,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభవృద్ధి, ట్రాన్సుకో,మత్స్య, అగ్నిమాపక,ఎపిఎస్ఆర్టీసి,రైల్వే,పర్యాటక,సమాచార పౌర సంబంధాలు, విపత్తుల నిర్వహణ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాల జన సమూహాల నిరంతర పర్యవేక్షణకు ఐటి,ఆర్టీజిఎస్ ల ద్వారా తగిన సాంకేతికతను సిద్ధం చేయాలని చెప్పారు.ముఖ్యంగా ఏఏ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందో ఆతేదీల్లో జన సమూహ సమర్ధనిర్వహణకు తగిన ప్రణాళికు సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ అలహాబాదులో జరిగిన గంగానది మహా కుంభమేళలో జరిగిన అనుభవాలను గత గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏఏ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే దానిపై అంచనా వేసి అందుకు రెట్టింపు స్థాయిలో ఏర్పాట్లు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు. రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా గోదావరి పుష్కరాలు జరగునున్నందున మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన విధంగా వివిధ ప్రాంతాలను గుర్తించి అక్కడ తాత్కాలిక టెంట్ సిటీలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రతి జిల్లాల్లో జెసి స్థాయి అధికారిని ప్రత్యేకంగా ఇన్చార్జిగా నియమించాలని,ప్రతి జిల్లాకు ఒక సవివర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు సూచించారు.
ఈసమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహరలాల్ పుష్కరాల ఏర్పాట్లపై ప్రెజెంటేషన్ ఇస్తూ బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సందర్భంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఆప్రకారం 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకూ 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగిందని చెప్పారు.గోదవరి పుష్కరాలను దక్షిణ భారతదేశపు ప్రధాన కుంభమేళాగా పేర్కొంటారని అన్నారు.పుష్కరాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం,తమ పూర్వీకుల పేరిట పిండ ప్రదానాలు,కర్మకాండలు నిర్వహించడం వంటివి నిర్వహిస్తారని వివరించారు.గోదావరి నది అల్లూరి సీతారామ రాజు జిల్లా గుండాల వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుందని అక్కడ మొదటి స్నానఘట్టం ఉంటుందని అన్నారు.గోదావరి పుష్కరాలకు సంబంధించి లోగోను రూపొందించాల్సి ఉందని ఇందుకు సంబంధించి త్వరలో విద్యార్ధులు,ప్రజల నుండి ఎంట్రీలు ఆహ్వానించి మంచి లోగోను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.గోదావరి నది వెంబడి ఎ కేటగిరికి సంబంధించి 36,బి కేటగిరి 48, సి కేటగిరి కింద 285 స్నాన ఘట్టాలున్నాయని, గత 2015 గోదావరి పుష్కరాల్లో 1412 కోట్ల రూ.లతో 2వేల 529 వివిధ పనులను చేపట్టడం జరిగిందని వివరించారు.
గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ పుష్కరాల ఏర్పాట్లపై ప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పటికే జిల్లా కలక్టర్లతో ఒక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.2015 గోదావరి పుష్కరాలకు 4కోట్ల 86 వేల మంది భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారని రానున్న పుష్కరాలకు రెట్టింపు సంఖ్యలో 9నుండి 10కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని ఆదిశగా తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.2015లో పుష్కరాలకు వచ్చే భక్తులకు 1927 బస్సులు,400 రైళ్ళను ఏర్పాటు చేయగా ఈసారి వాటికి మించి రెట్టింపు సంఖ్యలో ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.జిల్లాల వారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలక్టర్లకు సూచించారు. అలాగే సంబంధిత శాఖల కార్యదర్శులు వెంటనే వారి వారి శాఖల కింది స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
ఈసమావేశంలో దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,జలవనరుల శాఖ సిఇ శేషు బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ముఖ్య కార్యదర్శులు ఎస్ సురేష్ కుమార్,శశి భూషణ్ కుమార్,ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావు,ఎడిజి శాంతి భద్రతలు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ ఐఅండ్పిఆర్ కెఎస్.విశ్వనాధన్,ఎండి ఎపిటిడిసి ఆమ్రపాలి,ఇతర శాఖల కార్యదర్శులు,అధికారులు,ఆరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
